Copied!
*ఋక్కుల కందని నిక్కపు గురువు*
*ఘన వైద్యునిగా, మహాకవిగా, వ్యాఖ్యాతగా, తత్త్వవేత్తగా, పరమ గురువుగా, ప్రవక్తగా తన ప్రజ్ఞను లోకశ్రేయస్సుకై బహుముఖాలుగా ప్రసరింపజేసిన కులపతి ఎక్కిరాల కృష్ణమాచార్య ఒక విశిష్టమైన వ్యక్తి. నిజానికి ఆయన ఒక వ్యక్తి కాదు. ఒక సంస్థ. ఒక మహోద్యమం. ఆ ఉద్యమం మానవజాతి అభ్యున్నతికి కావలసిన అన్ని కోణాలనుండి వెలుగులు వెదజల్లగల సత్తా గలది. భారతజాతి పునర్నిర్మాణంతో పాటు ప్రాక్పశ్చిమ సమన్వయానికీ, ప్రపంచ శాంతికీ కూడ ఈ ఉద్యమం అంకితమైంది.*
*కృష్ణమాచార్యది చక్కని రూపం.ఆ రూపం దివ్యసుందరం. బంగరు మేనిఛాయ. కాంతి గోళాలవంటి కళ్ళు.ఆయన ముఖంలో ప్రేమ, గాంభీర్యం సమతూకంగా వ్యక్తమవుతూ ఉంటాయి. ఆయన గళం విప్పితే సింహగర్జన గుర్తుకొచ్చేది.ఆయన వాక్కు వేదంలా ప్రభు సమ్మితంగా, బాణంలా సూటిగా దూసుకుపోయేది. ఆయన ప్రవచిస్తున్నపుడు మధురంగా చెప్పటమేకాదు, మందలిస్తూ చెప్పడమూ ఉండేది. విషయాన్ని వివరించటమేకాదు ఆవశ్యకతనుబట్టి సవరించటమూ జరిగేది. ఆయన కేవలం వక్త కాడు ప్రవక్త.పదిమంది మెచ్చుకోవాలని చెప్పినవాడు కాడు,పదిమంది నేర్చుకోవాలని చెప్పినవాడు. చేతుల చప్పట్లకోసం చెప్పినవాడు కాడు,వెన్నులు తట్టడంకోసం ఎలుగెత్తినవాడు. పెదవుల మందస్మితాల నాశించి చెప్పినవాడు కాడు, హృదయాలు స్పందించడంకోసం పలికినవాడు. సన్మానాలను ఆశించి వేదికల నెక్కినవాడు కాడు,సన్మార్గాన్ని నిర్దేశించడంకోసం వేదికను స్వీకరించినవాడు. అది మందవనీ, మంచి మాటవనీ, మరే కార్యక్రమమవనీ పదిమందికీ పంచేటందుకు కల్పవృక్షంలా నిలబడినవాడు తప్ప ఎన్నడూ,ఎవరి నుండీ, ఏమీ కోరినవాడు కాడు. పెట్టి పుట్టాలంటారు చాలామంది. పుట్టి పెట్టినవాడాయన.*
*కృష్ణమాచార్యకు తల్లి నుండి కృష్ణతత్వం,తండ్రి నుండి వేద సౌరభం, సేవాభావం పిన్ననాటనే హత్తుకొన్నాయి. తండ్రే గురువుగా ఆయన చదువు సంధ్యలు సహజ వైభవంగా సాగాయి.కృష్ణమాచార్యకు తండ్రినుండి మొదటగా అబ్బింది నిర్భీతి. తండ్రి స్వచ్ఛంద సేవాజీవితంలోని తృప్తి, నిండుదనం ఆయనను ఎంతగానో ఆకట్టుకొన్నాయి. "సహకరించి బ్రతకాలితప్ప ఆశ్రయించి బ్రతక్కూడదు. ఎవడికాళ్ళపై వాడు నిలబడగలగాలి తప్ప నిరుద్యోగిగా నిరుత్సాహపడకూడదు. జీవశక్తిని సద్వినియోగ పరచి సత్కర్మాచరణగా వ్యక్తం చేయగలగాలి తప్ప అలసత్వాన్ని వరించి దీనత్వాన్ని పొందగూడదు" అన్న సందేశాన్ని గొంతెత్తి అందిస్తూ తాను అలా నిలబడి కొన్ని వేలమంది యువకులను అలా తీర్చిదిద్ది నిలబెట్టిన కృష్ణమాచార్యకు పైన చెప్పబడిన తండ్రి జీవిత వైభవమే ప్రేరణ ఇచ్చినదని చెప్పవచ్చు. తల్లిదండ్రులనుండి జన్మను పొందటమేగాక జన్మెత్తినందుకు సాధించవలసిన పరమార్థాన్ని కూడా ఆ తల్లిదండ్రుల జీవితాలనుండే అందుకున్న కృష్ణమాచార్య కారణజన్ములు. అట్టి బిడ్డనుకన్న ఆ తల్లిదండ్రులు ధన్యజీవులు.*
*కృష్ణమాచార్య అంతరంగం నిండా బాధ్యతాయుతమైన ప్రేమ నిండి ఉండేది ఎల్లవేళలా. ఆ ప్రేమకు తర తమ భేదం లేదు. ఆత్మీయులపైననే ప్రసరించి సరిపెట్టుకొనేది కాదది. అవసరంలో ఉన్న వారందరినీ అక్కునజేర్చుకొని ఒడ్డుకు చేర్చే స్వభావం గలది. తోటి విద్యార్థులకు ఆయన ఫీజులుకట్టి చదివించిన సంఘటనలు ఉన్నాయి. ధైర్యం చెప్పి చేయూత నిచ్చి విషాదయోగం పోగొట్టి మిత్రుల్ని పరీక్షలు వ్రాయించిన సన్నివేశాలున్నాయి. ఆయన ఉంటే మిత్రకూటమికి ఎంతో ధైర్యం, నిండుదనం. ఆయన అప్పటినుండీ గురువే, నాయకుడే! స్వభావం ముందునుండీ ఉంటుంది. పేర్లూ ప్రతిష్టలూ కాలక్రమంలో వస్తాయి. ఎవరి విషయంలోనైనా అంతే!*
*ప్రార్థన సమయంలో గాయత్రిని ఉపాసిస్తూ ఉండగా మాస్టరు సి.వి.వి. దర్శన మిచ్చి వీరిని శిష్యునిగా స్వీకరించారు. తానుపాసిస్తున్న గాయత్రియే తనకు కావలసిన గురుమూర్తిగా ప్రసన్నమైనదని గ్రహించిన వీరు తమ జీవితాన్ని ఆ గురుమూర్తికి సమర్పణ చేసి, శరీరాన్ని ఆ "వెలుగు" లోకానికి వ్యక్తమయ్యేటందుకు ఒక వాహికగా నిలబెట్టారు.*
*గుంటూరులో ఉన్న రోజుల్లోనే కృష్ణమాచార్య "జ్యోతిర్విద్య" లో నిష్ణాతులుగా, పురాణేతిహాసాల పరమార్థ వివరణ కర్తగా, దివ్యజ్ఞాన వాఙ్మయ ఉపదేశకునిగా, సనాతన ధర్మంలోని సమన్వయాన్ని అందించి సహజీవనానికి దారిచూపే దివ్య యువకునిగా ప్రసిద్ధులయ్యారు.అన్నిటినీ మించి ఎంతోమంది యువకుల విషయంలో బాధ్యతపడి వారి సామర్థ్యాలకు రూపు రేఖలు దిద్దటం ప్రారంభించడంతో నవతర నిర్మాణానికి అప్పుడే అక్కడే ఆయన నాంది పలికినట్లయింది. నడుము కట్టినట్లయింది. 'తోటి వారి కష్టసుఖాలలో పాలుపంచుకొనని మానవుడు ఎంత గొప్పవాడైనా వ్యర్ధజీవే'నని ఆయన సందేశం. బాధలలో ఉన్న వారి యెడల బాధ్యత పడే ఆ దివ్యలక్షణమే కాలక్రమంలో ఆయనను ఒక దివ్యరక్షకునిగా రూపొందించింది. ఈ రోజుల్లోనే తన రెండవ కుమారునికి మూర్ఛవ్యాధిని నివారించడంకోసం ఆయన హోమియో వైద్యశాస్త్రాన్ని అధ్యయనం చేయటం ప్రారంభించారు. ఈ అధ్యయన ప్రయోగాలు జరుగుతూ ఉండగానే ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పరిశోధన నిమిత్తంగా కృష్ణమాచార్య విశాఖకు సకుటుంబంగా తరలి రావడం జరిగింది.*
*విశాఖ చేరినప్పటి నుండి కృష్ణమాచార్య ప్రజలకు హోమియో వైద్యుడిగా పరిచయం కాసాగారు. తెనాలి రామకృష్ణుని కావ్యాలపై ఒక వంక పరిశోధన చేస్తూ మరొకవంక హోమియో వైద్యంతో రోగార్తుల గుంపులకు స్వస్థత చేకూర్చసాగారు. యూనివర్శిటీవారు పి. హెచ్.డి.ఇచ్చి డాక్టరుగా ఆయనను గుర్తించే లోపుననే వేలాది ప్రజలు ఆయనను హోమియో డాక్టరుగా వినియోగించుకొని స్వస్థత పొంది ఆయన పేరు చెప్పి తమ ఇళ్ళల్లో దీపం పెట్టుకోసాగారు. ఆయన పాఠాలు చెప్పే డాక్టరుగా కన్నా ప్రాణాలు నిలిపే డాక్టరుగా అనితరసాధ్యమైన కీర్తి ప్రతిష్ఠలు పొందారు పి. హెచ్.డి. పొందిన భరువాత కృష్ణమాచార్య ఆంధ్ర విశ్వవిద్యాలయంలోనే ఉపన్యాసకులుగా జేరడంతో ఆయన కార్యక్రమాలకు విశాఖ పట్టణం ప్రధాన కేంద్రమైంది. 1974 వరకు ఆయన విశ్వవిద్యాలయంలో పనిచేసారు. ఆపైన విస్తృతమైన తమ విశ్వప్రణాళికను అమలు పరిచే నిమిత్తం తమ విశ్వవిద్యాలయ అధ్యాపక వృత్తికి స్వస్తి చెప్పారు.పనివెంట నడిచేవారిని పదవులు అడ్డుపెట్టగలవా !*
*తన తండ్రిగారు చేసిన వైద్యసేవ, దాని వైభవం, తన బిడ్డ ఆరోగ్యం కొరకు తాను పడిన పాట్లు, ఆ సందర్భంగా కళ్ళబడిన రోగార్తుల దీనపరిస్థితులు, దేశ ఆర్థిక స్థితిగతులు శ్రీ కృష్ణమాచార్యను ఉచిత హోమియో వైద్యాన్ని ఉద్యమంగా నిర్వహించేటట్లు ప్రేరేపించాయి. లోకహితాన్ని నిరంతరం కోరే ఆయనకు హోమియోపతి వైద్యం ఒక మంచి సాధనంగా అమరింది. తాను చేయటంతో సరిపెట్టుకోకుండా తమ సహచరులను వైద్యులుగా తీర్చిదిద్ది పరీక్షలకు పంపసాగారు. ఇలా తీర్చిదిద్దబడినవారు వేలసంఖ్యలో ఉన్నారిప్పుడు. వందలాది ఉచిత వైద్యాలయాలు దేశమంతటా పని చేస్తున్నాయి. ఇది కృష్ణమాచార్యగారి ఆసుప త్రిట అని తెలియగానే రోగి నిశ్చింతగా లోనికి ప్రవేశిస్తాడు. అక్కడ మందిచ్చేది ఎవరన్నది అతడి దృష్టిలో ఉండదు. కృష్ణమాచార్యగారి తాలూకు అని తెలిస్తే చాలు రోగికి సగం రోగం తగ్గిపోయినట్లే అవుతుంది. మందుకన్నా తన పేరే పెద్దమందుగా మార్చిన రక్షకుడాయన. దేశంలో విదేశాలలో ఈ వ్యాధి ఎక్కడా వినిపించుకోలేదట అన్న ప్రస్తావన ఎక్కడైనా వచ్చినప్పుడు "అన్నట్లు కృష్ణమాచార్య గారిని చూశారా !" అన్న ప్రశ్న చూడమన్న సలహా ప్రక్కవారిలో నుండి వినబడుతూ ఉండేవి. బాధలలో ఉన్నవారి దృష్టిని ఎక్కిరాల వైపుకు మళ్ళిస్తూ ఉండేవి. ఆయన వైద్యం ఎంత విలువైనదో ఆయన వైద్యం చేసే తీరు అంత విశిష్టమైనది. అనారోగ్యంతో తనకు దగ్గరైన వ్యక్తిని ఆయన ఆర్తునిగా కాక ఆప్తునిగా, దీనునిగా కాక దైవంగా దర్శించి వైద్యం చేసేవారు. సమానత్వం అంటే ఏమిటో దాన్ని తోటి వారి యెడల చూపటమెలాగో అయన సన్నిధిలో చక్కగా తెలియ వచ్చేది. సమానత్వం కావాలని కోరే వారిలో చాలామందికి దాన్ని గూర్చి ఆవేశపడడం తెలుసును గాని ఆ సమత్వాన్ని జీవితంలో చూడగలగటం తెలియదు. కృష్ణమాచార్య సమత్వాన్ని అనుభవించి, అనుభవింపజేసే స్థితిని తమ జీవితాంతం రుచి చూపిస్తూ,రుచి చూపించడం ద్వారా ఉపదేశిస్తూ వచ్చారు. ఆ దృష్టి లేనిదే, ఆ స్థితి రానిదే, ఎన్ని విద్యలున్నా, ఎంతటి సామర్థ్యం ఉన్నా వ్యర్థమని ఎలుగెత్తి చాటారాయన. ఈనాడు ప్రపంచం నలుమూలలా అసంఖ్యాకమైన కుటుంబాలు ఆయన వెలుగుకు అంకితమై సేవాదృక్పథంతో మెలుగుతూ వెలుగుతున్నాయంటే ఆయన చూపిన సర్వ సమత్వ స్థితియే కారణం.*
*1963 లో యూరప్ ఖండానికి చెందిన ఆల్బర్ట్ శశి అనే సిద్ధపురుషుడు కృష్ణమాచార్యను కలిసి ఆయనకు సహచరుడు కావడంతో కృష్ణమాచార్య సందేశం యూరప్ ఖండానికి ప్రసారం కావడం మొదలుపెట్టింది. 1972 నుండి కృష్ణమాచార్య ఐరోపాఖండ యాత్రలు ప్రారంభమయ్యాయి. అప్పటినుండి ఇంచుమించు సంవత్సరానికి రెండు నెలలు యూరపు దేశాలలో సనాతన ధర్మాన్ని ప్రబోధిస్తూ వచ్చారాయన. తత్ఫలితంగా జెనీవా నగరంలో మోరియా విశ్వవిద్యాలయం వీరి ఆధ్వర్యంలో రూపు కట్టుకుంది. మానవ జీవితానికి కావలసిన తత్త్వశాస్త్రాన్ని, వైద్యశాస్త్రాన్ని సమన్వయించి సమగ్రంగా అందించడం ద్వారా నవశకానికి నాంది పలుకుతున్న అంతర్జాతీయ విశ్వవిద్యాలయమిది. సమాన దృక్పధం కలిగిన ఆధ్యాత్మిక సేవా సంస్థలను ఒకచోటికి కూడగట్టి అభ్యుదయ కార్యక్రమాలను విస్తృత పరిధిలో విజృంభింప జేసిన కులపతి కృష్ణమాచార్యది ఎంతటి విశాల హృదయమో మనం ఊహించవచ్చు."ప్రజలకొరకు సంస్థ గాని, సంస్థ కొరకు ప్రజలు కాదు అన్నది ఆయన సూక్తి. సంస్థలు ప్రజలను బ్రతిమాలి పోషింపబడటం కాకుండా ప్రజలకు తీరుగా బ్రతకగల శిక్షణను ఈయగలగాలి. సంస్థలు కేలండరులో పేజీల్లాంటివి. నెల అయిపోగానే ఆ పేజీ చింపేస్తాం. అలాగే కాలక్రమంలో పాత సంస్థలు పోయి కొత్త సంస్థలు వస్తూ ఉంటాయి. కాని కాలం ఆగనట్లు కార్యక్రమం కూడ వ్యక్తుల మీదుగా సంస్థల మీదుగా సాగిపోతూనే ఉంటుంది "అన్నవి కులపతి తరచూ చెప్పే హితవచనాలు. ఆయన దృష్టిలో సంస్థలు మంచి పనిని చేయడానికి ఉపకరణాలు మాత్రమే. నిజమే మరి. వంట చేయగలిగిన వాడికి పాత్రలు పనికివచ్చినట్లు సేవ చేయగలిగిన వాడికి సంస్థలు పనికివస్తాయి.*
*కృష్ణమాచార్య పరమార్థాన్ని మధురంగా, మంద్రంగా అందించగల మహాకవి,గొప్ప రచయిత.శతాధికంగా గ్రంధాలను రచించిన కులపతి ఈ గ్రంధాలలో వేటినీ తీరికగా కూర్చుని రచించలేదు. ఒక ప్రక్క ప్రాణ ప్రమాద స్థితిలోనున్న రోగార్తులకు సేవచేస్తూ మరొక ప్రక్క ఆత్మీయులైన వ్రాయసగాండ్రకు ఆశువుగా చెప్పగా రూపొందినవే ఈ గ్రంథాలన్నీ. ఆయన వ్రాసిన గ్రంథాల్లో కాలక్షేపానికని వ్రాసిన గ్రంథం ఒక్కటీ లేదు. మనిషిని గూర్చి మనిషికి తెలియజెప్పి అతణ్ణి కర్తవ్యం వైపుకు నడిపించడానికి ఉద్దేశించి ఈయబడినవే ఈ గ్రంథాలన్నీ.ఆయన వైద్యంతో రోగులను, వాఙ్మయంతో మానవజాతినీ ఏకకాలంలో ట్రీట్ చేస్తూ వచ్చారు. ఈ ట్రీట్ మెంటు అగేది కాదు. చిరకాలం సాగేది.*
*వేదాన్ని అడిగిన వారి సొత్తు చేశారాయన. దాన్ని కావాలని కోరడమే దాన్ని నేర్చుకోవడానికి కావల్సిన అర్హత అన్నారు. కులమతాలకు స్త్రీ పురుష భేదాలకు అతీతంగా వేదాధ్యయనం, గాయత్రీజపం, షోడశోపచారపూజ, నిత్యాగ్నిహోత్రం కొన్ని వేల గృహాలలో నిత్యమూ ఆచరింపబడటానికి కారకులైనారాయన. వేదవిద్యను ఉపాసించటానికి ఉన్ముఖులైన వారందరకూ జాతి మత కుల భేదాలతో నిమిత్తం లేకుండా ఉపనయన సంస్కారాన్ని జరిపిస్తూ వచ్చారాయన. దేవుడందరివాడు, అందరిలోనివాడు. అందరూ తానైనవాడు అయినప్పుడు దేవుణ్ణి గూర్చిన వాఙ్మయం, ఉపాసనలు అందరికీ చెందినవే కదా! మనుషుల మనస్సులకు పొరలు కప్పినప్పుడల్లా మహాత్ములు దిగి వచ్చి ఆ పొరలు కరిగిస్తారు. తెరలు తొలగిస్తారు. అందరినీ ఒక్కటిగా చూస్తారు. ఒక్కటిగా చేస్తారు.*
*గృహస్థాశ్రమ నిర్వహణ వలన మనిషిని వరించే పవిత్రమైన పరిపూర్ణతను తమ జీవితం ద్వారా వ్యక్తం చేస్తూ, మనువు ఏర్పరచిన చతురాశ్రమ విధానంలోని సార్ధకతను లోకానికి మరొకసారి తెలియజెప్పారు కృష్ణమాచార్య. వైవాహిక జీవితం ఆధ్యాత్మిక సాధనకు అడ్డంకి కాదనీ ఆ సాధనలో పరిపూర్ణతను పొందేటందుకు చక్కని అవకాశమనీ నొక్కి చెప్పారాయన.దాంపత్యబంధం కామసుఖం కొరకు పడే కక్కుర్తిగా గాక రెండు జీవితాల సహచర్యంగా, సంగమంగా దర్శించినవారే నిజమైన దంపతులని ఆయన ఉపదేశం. దేహాల కలయిక దాంపత్యమనుకునే స్థితినుండి మనస్సుల కలయికకూ ఆపైన ఆత్మల కలయికకూ నోచుకొని, ఒకటిగా జీవిస్తూ, దేహాల `సంసర్గాన్ని కేవలం సంతాన ప్రాప్తికొరకే వినియోగించుకోగల ఉత్తమస్థితికి దంపతులు ఎదగాలని ఆయన ఉద్బోధ. "పిల్లలు మీ కామసుఖానికి ఫలితాలు కాకూడదు. మీ సహచర్యానికి ప్రతీకలు కావాలి. రానున్న తరాల్ని సృష్టించడంలో మనవంతు బాధ్యత మనం పవిత్రంగా నిర్వహించాలి." అంటూ ఆదర్శ దంపతులను అసంఖ్యాకంగా తీర్చిదిద్దుతూ వచ్చారాయన. స్త్రీలకు శిక్షణ, పురుషులకు శిక్షణ అన్నట్లుగాక దంపతులకు శిక్షణ అన్నట్లు ఇచ్చారాయన. వివేకానందుడు సేవవైపుకు త్రిప్పి సన్యాసాశ్రమానికి సార్ధకత చేకూర్చినట్లు కృష్ణమాచార్య దంపకులకు శిక్షణనిచ్చి కుటుంబాలను దేవాలయాలుగా, సేవా యజ్ఞశాలలుగా తీర్చిదిద్ది సనాతన ధర్మంలోని గృహస్థాశ్రమ వైభవాన్ని పునఃప్రతిష్ఠించారు.*
*తమ వెలుగుకు దగ్గరైనవారిని అభిమానులుగా గాక అనుయాయులుగా, సేవకులుగా తీర్చిదిద్దారాయన. అనుయాయులు అంటే తనను అనుసరించేవారుగా కాక తాను ఏ వెలుగును అను సరిస్తున్నారో ఆ వెలుగుకు అనుయాయులుగా,సేవకులు అంటే తనను సేవించేవారుగా గాక, తనలా ఆర్తజనులను సేవించేవారుగా ఆయన తీర్చిదిద్దుతూ వచ్చారు. తననుండి వ్యక్తమవుతున్న విద్యలనూ, శాస్త్రాలనూ అడిగినదే తడవుగా వారికి వెదజల్లుతూ వచ్చారాయన. ఆయా వ్యక్తుల జీవసంస్కారాలకు తగిన శిక్షణ, పోషణలను అందిస్తూ అనుయాయులను తనంత వారుగా తయారుచేస్తూ వారిని సహచరులుగా గౌరవిస్తూ వచ్చారాయన. "నేనెన్నాళ్ళని గజ్జెకట్టి ఆడను? మీరాడండి నన్ను చూడనివ్వండి. నే చేస్తున్నపని మీరు చేయండి, అప్పుడు నేనంతకన్న పై పనిని చేయడానికి వీలవుతుంది"అంటూ హెచ్చరికలు చేస్తూ వారి ఎదుగుదలను వేగవంతం చేస్తూ వచ్చారాయన. "రాజకీయవాదులు తమ చుట్టూ ఉన్నవారు తమను మించకూడదని కోరుకుంటూ ఉంటారు. మాలాంటి వాళ్ళం మాతో ఉన్నవాళ్ళు మమ్మల్ని ఎప్పుడు మించుతారా అని చూస్తూ ఉంటాం. పుత్రుని చేతిలో ఓడిపోయినపుడే తండ్రికి సంతోషం. శిష్యుని చేతిలో ఓడిపోయినపుడే గురువునకు సంతోషం"అంటూ తనకున్నది పంచిపెట్టడం కాక తననే పంచి పెట్టుకొన్న విరాట్పురుషుడాయన.*
*నిరుద్యోగులుగా నిర్వీర్యులుగా ఆవేశపరులుగా అలసులుగా తయారవుతున్న యువతరాన్ని మందలించి కనువిప్పు కలిగించి చేయూతనిచ్చి స్వయంసమృద్ధిని వారు సాధించుకునేట్లుగా శిక్షణనిస్తూ వచ్చారు కృష్ణమాచార్య.సామర్థ్యాన్ని సద్వినియోగపర్చడం ఎలాగో యువకులకు వెన్నంటి నేర్పుతూ వచ్చారాయన. వ్యాపార సంస్థలు, ప్రెస్సులు, కుటీర పరిశ్రమలు మొదలైనవెన్నో యువకుల చేత నెలకొల్పజేశారు. విద్యా విధానాన్ని తీర్చిదిద్దవలసిన ఆవశ్యకతను గమనించి బాలభాను విద్యాలయాల పేరిట ఆదర్శ విద్యాలయాలను పలుప్రాంతాల్లో ప్రారంభింపజేశారు. బోధనా ప్రణాళికలోని అవకతవకలను సరిదిద్ది ఆ విద్యాలయాల ఉపాధ్యాయులకు అందించారు.*
*"ఎవరికి వారుగా కాక ఒకరికి ఒకరుగా బ్రతకండి. ఒకరితో ఒకరు పోటీపడే స్వభావం నుండి ఒకరికొకరు సహకరించే స్థితికి ఎదగండి. హక్కులకోసం పోరాడే స్థితినుండి, బాధ్యతలు గుర్తించి వర్తించడం నేర్వండి. మతాల భేదాలతో కొట్లాడుకోకుండా ఆయా మతాల పేర్లతో పిలవబడుతున్నది ఒకే ఒక సనాతన ధర్మమని తెలిసి దానిని అనుష్ఠించండి. కులభేదాలతో కుళ్ళి పోకుండా కులాలు సామాజికమైన సౌకర్యానికై ఏర్పడ్డవేగాని మనుషుల్ని
విడదీయడానికి కాదని గ్రహించండి. గ్రహించి ఆ ఏర్పాటును సద్వినియోగం చేసుకోండి . ఎక్కువ తక్కువలను మరచి ఒకరియెడల ఒకరు మక్కువను అభ్యసించి సహజీవనంలోని మాధుర్యాన్ని చవిచూడండి" అని బోధిస్తూ, ప్రబోధిస్తూ ఆ సహజీవన అనుభూతిని గురుపూజల రూపంలో అనుగ్రహిస్తూ వచ్చారు. కులపతి కృష్ణమాచార్య.
*లోకం ఎడల తమకుగల ప్రేమను సానుభూతిగా కాక సేవగా వ్యక్తం చేయగలిగిన ధీరులు కృష్ణమాచార్య. సేవ అంటే ఏమిటి? చేయగలిగింది చేయడమా? కాదు. చేయదలచింది చేయడమా ? అంతకన్నా కాదు. మరి చేయవలసింది చేయటం అని కృష్ణమాచార్య తమ జీవితం ద్వారా తెలియజెప్పారు. ఆయన తండ్రిలేనివారికి తండ్రి అయ్యారు. బిడ్డలేని వారికి బిడ్డ అయ్యారు. అన్న లేనివారికి అన్న అయ్యారు. తమ్ముడు లేనివారికి తమ్ముడయ్యారు. రోగార్తులకు వైద్యుడయ్యారు. జిజ్ఞాసువులకు శ్రీధరుడయ్యారు. కష్టస్థితిలో ఉన్నవారికి రక్షకుడయ్యారు. దారి కోరినవారికి గురువయ్యారు. దైవాన్ని చూడగోరినవారికి దైవమై నిలచారు. ఎవరికి ఏది కావాలో వారినలా సేవించారు. ఆయన ప్రవర్తన సేవకు నిర్వచనం. ఆయన జీవితం లోకహిత స్వరూపం.*
*లోక హితార్థమై తమనుండి ప్రసరిస్తున్న వెలుగును సందేశంగా వ్యక్తం చేసినవారు కృష్ణమాచార్య. సందేశం ఇవ్వడం అంటే ఏమిటి? తాను నమ్మిన దానిని లోకంమీద రుద్దడమా? కాదు. లోకం పోకడను గమనించి దాన్నే తన సందేశంగా ఇచ్చి లోకం మెప్పును పొందడమా ? అంతకన్నా కాదు. మరి ........ లోకానికి ఏది శ్రేయస్సో, ఏది కర్తవ్యమో, దానిని నిర్మమంగా, నిర్మొహమాటంగా చెప్ప గలగటం అని కృష్ణమాచార్య తమ జీవిత విధానంద్వారా తెలియజెపుతూ వచ్చారు. ప్రస్తుత సమస్యలకు పరిష్కారమిస్తూ, ఆ సమస్యలకు కారణమైన ప్రపంచ పరిస్థితుల ఎడల అవగాహన పెంచుతూ, ఆ పరిస్థితుల సమన్వయానికి మానవ హృదయాలను ఉన్ముఖం చేసే శాశ్వతమైన విలువల సన్నిథికి మానవజాతిని నడిపేటందుకు తమ వాక్కును సమర్పణ చేశారు కృష్ణమాచార్య. ఆయన వెలుగే వాక్కుగా వ్యక్తమై చీకట్లను కరిగిస్తూ, లోకాలను వెలిగిస్తూ నవతరానికి రూపునిచ్చింది. నవశకానికి నాంది పలికింది.*
*ఈ భూమిపైన ఆయన గడిపిన జీవితం మానవజాతికి ఒక తీరైన ఆదర్శం. రానున్న తరాల అభ్యుదయానికి రాచబాట వేసిన ఆ రాజయోగికి, నవతర నిర్మాతకు, మహాకవికి, తత్త్వవేత్తకు, పరమ గురువుగా కొలవబడుతున్న ఆ పూర్ణ పురుషునకు ఆంజలి ఘటిద్దాం. ఆయనలా జీవించడమే మనము ఆయనకు ఆంజలి ఘటించే విధానం. ఆ ప్రయత్నంలో మనకెప్పుడూ లభిస్తుంది ఆయన సన్నిధానం.*
*(శ్రీ మోపిదేవి కృష్ణస్వామి గారి వ్యాసము నుండి కూర్పు చేయబడినది).*