Copied!
*పండితులు, కవులు, విమర్శకులు సామాన్య ప్రజలను పామరులని, అజ్ఞానులని భావించుట మదమును తెలియజేయును. సామాన్య ప్రజలే అసామాన్య ప్రజలు. వారి స్వభావము సార్వకాలికము. వారి ధర్మములు శాశ్వతములు. విజ్ఞానము, నాగరికత మారుచుండవచ్చును. అవి కేలండర్లలోని పేజీల వంటివి. అవసరము తీరినంతనే చింపిపారవేయవలసినవి. ఈ పుటలు చింపబడక తప్పదు. కాని సంవత్సరము వర్తించుచునే యుండును. ఇట్లు లక్షల సంవత్సరములు జరుగును. సామాన్య ప్రజల స్వభావ ధర్మములు, వారు వెలుగు బాటలలో ఆరోహించి తరించునట్టి సోపాన క్రమము శాశ్వతములు. ఆ సోపానములపై ధూళి రేణువుల వలె పండితులు; సంఘ సంస్కర్తలు, విమర్శకులు, కవులును ఎగురుచుందురు. ఇది నరజాతి శాశ్వత కథలో నొక భాగము.*
*ఈ పండిత విమర్శకాదులు, సంఘ సంస్కర్తలు సామాన్య ప్రజలకు ఏమియును చేయలేరనుటకు కారణమైన రహస్య మొకటియున్నది. లోకవైఖరి యొక మహా సముద్రము. ఈ వైఖరిలో, ఈ సామూహిక స్వభావములో నెవనికి వాడు ఈదులాడుచు, ఈ సముద్రమును ఒక మార్గము పట్టింపగలనను భ్రాంతిలో చనిపోవుచుందురు. వ్యక్తులలో ప్రత్యేకముగా ఆదర్శములు ఆశయములు ఉన్నను, అవి సంఘమను రథమునకు దీపములవంటివే గాని, సారథుల వంటివి కావు. ఎందరు వ్యక్తులున్నారో అన్ని విధములైన ఆదర్శములు వర్తించుచున్న ఈ మహాసముద్రమున ఎవని ఆదర్శము స్వతంత్ర సంచలనము పుట్టింప గలదు? వ్యక్తులలో ఆదర్శములున్నను వ్యక్తులు స్వభావ మహాసముద్రమున మునుకలు వేయుచున్నారు. ఈ రహస్యమునే నారదుడు వ్యాసునకు భాగవత రహస్యముగా బోధించెను. "కొండ చిలువచే మ్రింగబడుచున్న ఇద్దరిలో నొకరి నొకరు వెలుపలకు లాగి రక్షింపలేరు" అని నారదుడు హెచ్చరిక చేసెను. వ్యాసాదులు ఆరాధించినది సృష్టి మహాసముద్రము. అదియే జీవులలో నంతర్యామియైన నారాయణుడు. అందందరును వర్తించుచున్నారు. వాని కందరును వశులే. ఈ అంతర్యామితత్త్వము మానవుని బహిరంతర్లోకములలో వ్యాపించియున్నది. దాని నారాధించుచు వ్యాసాదులు రచనలు సాగించిరే గాని, పండితుల, విమర్శకుల, సంఘ సంస్కర్తల మొగములు చూచి కాదు. అట్టి రచనలకు పరిణత స్వరూపమై పరమావధియైన చరమావధిగా రూపుకట్టుకొన్నది శ్రీమద్భాగవతము. అది ఈ సృష్టి రూపమున నున్న అంతర్యామికి సమర్పితము. శాశ్వత కాలమునందు వచ్చుచు పోవుచున్న మానవుల మొత్తము స్వభావమైన మానవుడు భాగవతమునకు కథానాయకుడు. అతడు సృష్ట్యాదినుండి నేటివరకును ఏయే లోకముల దారులలో దిగి వచ్చెనో ఆ మొత్తము వైఖరిని అద్దము పట్టిచూపునది భాగవతము. నారాయణుడు, చతుర్ముఖుడు, స్వాయంభువ మనువు, ఆది వరాహమూర్తి,కపిలాచార్యుడు, విష్ణువు, శివుడు, అంబిక, ధ్రువుడు, పృథు చక్రవర్తి, ప్రహ్లాదుడు, అంబరీషుడు, శ్రీరాముడు, శ్రీకృష్ణుడు అను పాత్రలలో ఇందలి కథానాయకుడు సకల మానవధర్మ సంస్థాపనామూర్తియై రూపుకట్టెను. ఇన్నిటిని శ్రద్ధగా చదువుకొన్నచో- సృష్టి మొదలు నేటివరకును గల పురుషుడెవ్వడో, అతని శాశ్వత ధర్మస్వరూపమెట్టిదో విశదపడును.* *ఈ కథలన్నియును ఒకే నారాయణుని వివిధ ధర్మ గుణముల వివరణములే గాని, వేర్వేరు కథలు కావు. ఇందలి పురుషార్థములను భక్తితో నధ్యయనము చేసినచో - మానవునకు తెలియవలసిన వన్నియును తెలియును.* 🪶 *మాస్టర్ ఇ.కె.*